ఏమిటీ హంటావైరస్... ప్రమాదకరమైనదా?

  • విహార నౌకలో వెలుగు చూసిన హంటావైరస్ వ్యాప్తి
  • ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు మృతి
  • పలు దేశాలకు పాకిన వైరస్.. అధికారుల అప్రమత్తత
  • మనిషి నుంచి మనిషికి వ్యాపించే అరుదైన వైరస్‌గా గుర్తింపు
  • ప్రపంచ మహమ్మారిగా మారే ప్రమాదం తక్కువేనన్న డబ్ల్యూహెచ్ఓ
ఎంవీ హోండియస్ అనే విలాసవంతమైన విహార నౌకలో హంటావైరస్ వ్యాప్తి చెందినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ధృవీకరించింది. ఈ షిప్‌తో సంబంధం ఉన్న ఐదుగురికి వైరస్ సోకినట్టు తేలింది. అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఈ నౌకలో ఇప్పటికే ముగ్గురు మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మృతుల్లో డచ్ దంపతులు, ఒక జర్మన్ జాతీయుడు ఉన్నారు.

ప్రస్తుతం ఈ షిప్‌లో 23 దేశాలకు చెందిన 146 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా కఠినమైన ఆరోగ్య జాగ్రత్తల మధ్య ఉన్నారు. ఈ నౌక స్పెయిన్‌లోని టెనెరైఫ్ దీవులకు ఈ వారాంతంలో చేరుకోనుంది. అక్కడి నుంచి ప్రయాణికులను వారి వారి దేశాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. షిప్ నుంచి దిగి వెళ్లిన ప్రయాణికుల ద్వారా ఈ వైరస్ నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా, స్విట్జర్లాండ్, యూకే, యూఎస్ఏ, సింగపూర్ వంటి దేశాలకు చేరింది. ఆయా దేశాల్లోని వారిని గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.

అయితే, ఇది కోవిడ్ తరహాలో పెద్ద మహమ్మారిగా మారే ప్రమాదం తక్కువని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఈ వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ 1 నుంచి 6 వారాలు ఉండటంతో మరికొన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. షిప్ ఎక్కకముందే అర్జెంటీనా, చిలీ వంటి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రయాణికులకు ఈ వైరస్ సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. షిప్ ఆపరేటర్లు ప్రయాణికుల వివరాలు సేకరించి కాంటాక్ట్ ట్రేసింగ్‌కు సహకరిస్తున్నారు.

Hantavirus
MV Hondius
World Health Organization
WHO
Argentina
Netherlands
Tenerife
Hantavirus outbreak
cruise ship virus
infectious diseases

More Telugu News